విద్యార్థులు చదువు, ఉద్యోగం, భవిష్యత్తుపై దృష్టి సారించాలి
సద్దుల బతుకమ్మను సిద్దిపేట కోమటి చెరువు వద్దే జరుపుకుంటా
మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబర్ 15: సోషల్ మీడియా రీల్స్ మోజులో పడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని, ఆకర్షణలకు లోనై తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యార్థులకు సూచించారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా సొంత కాళ్లపై నిలబడాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ప్రతిభ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
కోమటి చెరువు కట్టపైనే సద్దుల బతుకమ్మ
సద్దుల బతుకమ్మను సిద్దిపేట ప్రజల మధ్య, కోమటి చెరువు కట్టపైనే జరుపుకుంటానని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దుబాయ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాల్లో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు తెలంగాణ సంఘాల నుంచి ఆహ్వానాలు వచ్చినట్లు తెలిపారు. అయితే తనకు కోమటి చెరువు కట్టతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన అక్కాచెల్లెళ్లు, పిల్లలు బతుకమ్మ ఆడే చోటే సద్దుల బతుకమ్మ రోజున తాను ఉంటానని పేర్కొన్నారు.
బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ పండుగ తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకంగా ఉండేదని గుర్తు చేశారు. పెళ్లయిన ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి తల్లిని కలుసుకోవడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం ఈ పండుగలోని ప్రత్యేకత అని చెప్పారు. తరాలు మారుతున్నా బతుకమ్మ వైభవం తగ్గకపోవడం తెలంగాణ సంస్కృతిపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు.
బతుకమ్మలో సంప్రదాయం, శాస్త్రీయత
బతుకమ్మ పండుగలో సంప్రదాయంతోపాటు ప్రకృతితో ముడిపడిన అంశాలు ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. గునుగు, తంగేడు వంటి పూలతో బతుకమ్మను పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేసే ఆచారం తరతరాలుగా కొనసాగుతోందన్నారు. వర్షాకాలం అనంతరం చెరువుల్లో చేరే మట్టి, మలినాలు, ఇతర పదార్థాల నేపథ్యంలో పూల వినియోగానికి శాస్త్రీయ ప్రాధాన్యం ఉందని పూర్వీకులు భావించారని వివరించారు. గతంలో చెరువులే గ్రామాలకు తాగునీరు, వ్యవసాయం, పశువుల అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉండేవని గుర్తుచేశారు. ప్రకృతి పరిరక్షణ, చెరువుల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే పండుగగా బతుకమ్మను భావించాలని సూచించారు.
సిద్ధిపేటకు విశ్వవిద్యాలయం తీసుకొస్తాం
సిద్ధిపేటను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని హరీశ్‌రావు తెలిపారు. పట్టణంలో వివిధ కోర్సులు అందుబాటు లోకి రావడంతోపాటు ప్రైవేట్ మెడికల్ కళాశాల, జిల్లాలో హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కళాశాల వంటి విద్యాసంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గాలన్నదే తమ లక్ష్యమన్నారు. సిద్ధిపేటకు ఒక విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడం తన తదుపరి లక్ష్యమని చెప్పారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఈ దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రీల్స్ వేరు.. నిజజీవితం వేరు
సోషల్ మీడియా ప్రభావంపై విద్యార్థులను ఉద్దేశించి హరీశ్ రావు కీలక సూచనలు చేశారు. రీల్స్‌లో కనిపించే ప్రతిదీ నిజజీవితంలో ఉండదని, వాటిని చూసి ప్రభావితమై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. అధిక సమయం ఫోన్‌కే కేటాయించడం వల్ల ఆలోచనా శక్తి తగ్గడంతో పాటు చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుందని హెచ్చరించారు.
ఇన్‌స్టా గ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవాలని, కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. వార్తలను తెలుసుకోవడంతో పాటు వాటిలోని మంచి చెడులను విశ్లేషించే అలవాటు పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
తొందరపాటు నిర్ణయాలతో భవిష్యత్తును దెబ్బ తీసుకోవద్దు
సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆకర్షణకు లోనై ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని హరీశ్ రావు అన్నారు. అలాంటి నిర్ణయాలు వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులకు మించిన శ్రేయోభిలాషులు ఎవరూ ఉండరని, వారి సలహాలను గౌరవించాలని సూచించారు.ప్రజాప్రతినిధిగా తన వద్దకు వ్యక్తిగత సమస్యలతో వచ్చే యువత, వారి కుటుంబాల బాధలను చూస్తున్నానని తెలిపారు. భావోద్వేగాల ప్రభావంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం బాధకు కారణం కావచ్చన్నారు. అందుకే ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు.
ఉద్యోగం సాధించి సొంత కాళ్లపై నిలబడాలి
విద్యార్థులు డిగ్రీతోనే చదువును ఆపకుండా పీజీ వంటి ఉన్నత విద్యను అభ్యసించాలని హరీశ్ రావు సూచించారు. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అని చూడకుండా ముందుగా ఉపాధి పొందాలని, ఆ తర్వాత మరింత మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించాలని అన్నారు. ఉద్యోగంతో పాటు వ్యాపారం, నూతన ఆవిష్కరణలపై కూడా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. యువత కష్టపడి చదివి, నైపుణ్యాలను పెంచుకుని ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తుపై బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఈ సూచనలు చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, ఆటలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
































