ఏసీబీ వలకు తహసీల్దార్

రూ.8 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి కూడా అరెస్ట్

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ అక్టోబర్ 15: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సహకరించేందుకు రూ.8 వేల లంచం డిమాండ్ చేసి, ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నట్లు వెల్లడించారు.

గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం లంచం *
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఎం.డి. అబూబకర్ (ఏవో-1) ఓ ఫిర్యాదుదారుడి నుంచి రూ.8 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారుడి అత్తకు చెందిన వ్యవసాయ భూమిని ఆయన తండ్రి పేరుపై గిఫ్ట్ డీడ్ (బహుమతి పత్రం) ద్వారా రిజిస్ట్రేషన్ చేయించేందుకు సహకరించే విషయంలో ఈ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్యవహారంలో అదే కార్యాలయంలో భూ భారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కుమార్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. అతడి ద్వారా లంచం సొమ్మును స్వీకరిస్తుండగా అక్టోబర్ 15, 2026న కరీంనగర్ పరిధికి చెందిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

  • రూ.8 వేల నగదు స్వాధీనం *

దాడి సమయంలో ప్రైవేట్ వ్యక్తి అనిల్ కుమార్ వద్ద నుంచి లంచం సొమ్ము రూ.8 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విధులను చట్టవిరుద్ధంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు తహసీల్దార్‌పై ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ వెల్లడించింది.

న్యాయస్థానంలో హాజరు *
ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న తహసీల్దార్ ఎం.డి. అబూబకర్, ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కుమార్‌లను కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.ఫిర్యాదుదారుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News