- మంత్రి పొన్నం ప్రభాకర్*
- అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్*
ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, అక్టోబర్ 15: హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు, అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద బతుకమ్మ ఘాట్ల వద్ద శుభ్రత, మట్టి పనులు, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. ఏర్పాట్ల విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టి
హుస్నాబాద్ నియోజకవర్గంలో ALIMCO అధ్వర్యంలో ADIP పథకం కింద దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాల పంపిణీ కోసం ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ప్రత్యేక శిబిరాల నిర్వహణపై సమాచారం క్షేత్రస్థాయి వరకు చేరిందా? అనే అంశాలపై మంత్రి అధికారులను ఆరా తీశారు.
గ్రామాల్లో డప్పు చాటింపుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి, అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు అందించే సహాయక పరికరాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఒక్క అర్హుడైన లబ్ధిదారుడు కూడా మిస్ కాకుండా గుర్తించి, ప్రతి ఒక్కరికీ సహాయక పరికరాలు అందేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలో రెండు మండలాలకు ఒక రోజు, హనుమకొండ జిల్లాలో రెండు మండలాలకు ఒక రోజు, సిద్దిపేట జిల్లాలో మూడు మండలాలకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
శిబిరాల నిర్వహణకు ముందుగానే అర్హులైన లబ్ధిదారుల వివరాలను సేకరించి పూర్తి స్థాయి డేటా సిద్ధం చేయాలని తెలిపారు. అర్హులైన వారందరూ శిబిరాలకు హాజరయ్యేలా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు.డీఆర్డీఓ, పీడీ, డీడబ్ల్యూఓలతో పాటు జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయక పరికరాలు అందించడంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.





























