సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు
తిమ్మాయిపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 16: మంగళ వాయిద్యాలు.. వేద మంత్రోచ్ఛారణలు.. మహిళల భక్తిపారవశ్యం.. కుంకుమార్చనలతో తిమ్మాయిపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి సామూహిక సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో రాక్ స్టార్ యూత్ అసోసియేషన్, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితుడు అజయ్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు, ఆడపడుచులు సామూహిక సహస్ర కుంకుమార్చనలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా పురోహితుడు అజయ్ శర్మ మాట్లాడుతూ.. చదువుల తల్లి సరస్వతీ దేవి అనుగ్రహంతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు, రెడ్డి సంఘం నాయకులు, గ్రామ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.






























