కమ్మర్లపల్లి, మందపల్లిలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబర్ 16: తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు.. సంప్రదాయ పాటలతో మార్మోగిన పల్లెలు.. ఆటపాటలతో సందడి చేసిన ఆడపడుచులు.. వెరసి కమ్మర్లపల్లి, మందపల్లి గ్రామాల్లో పండుగ శోభ వెల్లివిరిసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను చిన్నకోడూరు మండలంలోని ఈ రెండు గ్రామాల్లో మహిళలు, యువతులు ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది.
పూలతో బతుకమ్మల అలంకరణ
ఏడు రోజుల బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మహిళలు, యువతులు వివిధ రకాల రంగురంగుల పూలను సేకరించారు. వాటితో బతుకమ్మలను అందంగా పేర్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరారు. బతుకమ్మ పాటలు పాడుతూ లయబద్ధంగా ఆడారు. చప్పట్లతో సందడి చేశారు. మహిళల ఆటపాటలతో గ్రామాల్లో సందడి నెలకొంది.
ఐక్యతకు ప్రతీకగా వేడుకలు
బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంప్రదాయాలను కొనసాగిస్తూ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ రేగుల శ్యామల దేవయ్య, ఉపసర్పంచ్ కప్పెర రాజిరెడ్డి, వార్డు సభ్యులు పిల్లి పవన్, జక్కుల రాములు, ఎలుకపల్లి విజయ, భూమయ్య, ఇస్కిల్ల రేణుక, పరశురాములు, కొట్టేపల్లి విజయ, పసుపుల యాదగిరి, కేంగర్ల కనకవ్వతో పాటు యువతీ యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






























