జర్నలిస్టులపై దాడి చేసిన గంభీరావుపేట పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) డిమాండ్

ప్రతిపక్షం, అక్టోబర్ 17, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై, ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘ఎకదం న్యూస్’ ఎడిటర్, జర్నలిస్టులు పొత్తూరి శేఖర్, రాతిపల్లి సంపత్‌లను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) నాయకులు శనివారం పరామర్శించారు. AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల-తంగేళ్ళ కిరణ్ కుమార్ బాధిత జర్నలిస్టులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ… నిజాన్ని నిర్భయంగా వార్తల రూపంలో సమాజానికి అందించినందుకే జర్నలిస్టులపై పోలీసులు చిత్రహింసలకు పాల్పడటం అత్యంత దారుణమని మండిపడ్డారు. అరెస్ట్ చేసే ముందు కనీసం ముందస్తు నోటీసు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందించకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. చట్టం పరిధి దాటి జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన గంభీరావుపేట పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన తీవ్రంగా డిమాండ్ చేశారు.


ప్రధాన డిమాండ్లు:
మెరుగైన వైద్యం: చిత్రహింసలకు గురైన జర్నలిస్టులు పొత్తూరి శేఖర్‌, రాతిపల్లి సంపత్‌లకు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో మెరుగైన వైద్య చికిత్స అందించాలి.
బాధిత కుటుంబాలకు అండ: పోలీసు అరాచకత్వానికి గురైన బాధిత జర్నలిస్టుల కుటుంబాలకు AIFB పూర్తి అండగా ఉంటుంది.
జర్నలిస్టులకు రక్షణ: జర్నలిస్టులు స్వేచ్ఛగా, నిర్భయంగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలి.
న్యాయం చేయాలి: ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలి.
ఈ పరామర్శ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిట్టన్నా, ప్రవీణ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News