*7వ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
*భక్తిపారవశ్యంతో మహిళల కుంకుమ పూజలు
ప్రతిపక్షం చండూరు అక్టోబర్ 17: చండూరు మండలం పుల్లెంల గ్రామంలో శ్రీ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ 11వ వార్షికోత్సవ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
*మహిళల కుంకుమ పూజలు..
ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిపారవశ్యంతో కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థించారు.భక్తుల జయజయధ్వానాలు, మంగళహారతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
*ఆధ్యాత్మిక వాతావరణం…
భక్తి, విశ్వాసం, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నవరాత్రి ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.
ఉత్సవాలకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.





























