సిద్ధిపేట వైద్యుడికి జాతీయ కీర్తి.. టాప్‌-10లో అశోక్‌ కుమార్‌!

జాతీయ స్థాయిలో అశోక్‌ కుమార్‌ ప్రతిభ!

దేశంలో టాప్‌-10 గైనకాలజిస్టుల జాబితాలో చోటు

ప్రతిపక్షం, అక్టోబర్ 17: సిద్ధిపేట వైద్య రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మూడు దశాబ్దాలుగా మహిళల ఆరోగ్య పరిరక్షణకు అంకిత భావంతో సేవలందిస్తున్న స్థానిక సత్య నర్సింగ్‌ హోమ్‌ వైద్యుడు డాక్టర్‌ అశోక్‌కుమార్‌ ప్రతిష్ఠాత్మక గుర్తింపు సాధించారు. ‘ది ఇండస్ట్రీ ఇన్‌సైట్స్‌’(టీఐఐ) మ్యాగజైన్‌ ప్రచురించిన ప్రత్యేక సంచికలో 2026లో భారతదేశంలోని ప్రముఖ 10 మంది గైనకాలజిస్టుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. స్థానికంగా వైద్యసేవలు అందిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషంగా నిలిచింది.

మూడు దశాబ్దాలుగా వైద్యసేవలు

డాక్టర్‌ అశోక్‌కుమార్‌ 1996 నుంచి సత్య నర్సింగ్‌ హోమ్‌ ద్వారా సిద్ధిపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. క్లిష్టమైన గర్భధారణలు, హైరిస్క్‌ ప్రసవాల నిర్వహణలో సేవలందిస్తున్నారు. ఆధునిక లాపరోస్కోపిక్‌ వైద్య విధానాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. నాణ్యమైన వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

పేదలకు అండగా మానవీయ సేవలు

వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేద రోగులకు అండగా నిలవడం ఆయన ప్రత్యేకత. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే రోగులకు వైద్య ఫీజులను తగ్గిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో ఫీజులకు మినహాయింపు ఇస్తున్నారు. వైద్య సేవను కేవలం వృత్తిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు.

వైద్యుల నైపుణ్యాభివృద్ధికి కృషి

సిద్దిపేట ఆబ్స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ సొసైటీ (సాగ్స్‌) అధ్యక్షుడిగా డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్యులకు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాలను పరిచయం చేస్తూ నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు.

సంగీతంలో ప్రత్యేక ముద్ర

వైద్య వృత్తిలో నిరంతరం బిజీగా ఉండే డాక్టర్‌ అశోక్‌కుమార్‌కు సంగీతం పైనా ప్రత్యేక ఆసక్తి ఉంది. ఇప్పటివరకు సుమారు 6,000 పాటలను రికార్డు చేయడం ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనం. వైద్య సేవలతో పాటు సంగీతంలోనూ తనదైన ముద్ర వేయడం విశేషం.

ఆస్పత్రి సిబ్బంది హర్షం

జాతీయ స్థాయి మ్యాగజైన్‌ ప్రత్యేక సంచికలో టాప్ -10 గైనకాలజిస్టుల జాబితాలో డాక్టర్ అశోక్ కుమార్ చోటు దక్కడంతో సత్య నర్సింగ్ హోమ్ ఆస్పత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలచారి, గిరి, మల్లేశం, మురళి, ఆస్పత్రి నర్సింగ్‌ సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపారు. డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ సాధించిన గుర్తింపు సిద్దిపేట వైద్య రంగానికి గర్వ కారణంగా నిలిచింది.

Spread the love

Related News

Latest News