ఎల్నినో హెచ్చరికలున్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు
పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలి: బట్టి అజయ్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, అక్టోబర్ 17: మెదక్ మండలంలోని గుట్టకిందిపల్లి, శివాయపల్లి గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి బట్టి అజయ్ శనివారం పరిశీలించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా బట్టి అజయ్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. యాసంగిలో వరి సాగు తగ్గించాలని రైతులకు సూచించే బదులు, ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే ఈ పరిస్థితి కొంతవరకు నివారించగలిగేవారని అన్నారు. విద్యుత్ కోతల కారణంగా బోర్ల ద్వారా పంటలకు నీరు అందించలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఇప్పటివరకు సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడం బాధాకరమని విమర్శించారు. తక్షణమే రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు, పంటలను కాపాడుకునేందుకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. పంటలు ఎండిపోయిన ప్రాంతాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో గుట్టకిందిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్, ఉపాధ్యక్షుడు ప్రశాంత్, భూపత్పూర్ గ్రామ సీనియర్ నాయకులు కరాటే ప్రేమ్, రమేష్తోపాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
































