దుర్గాదేవిగా దర్శనమిచ్చిన ఏడుపాయల వనదుర్గమ్మ

అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. భక్తుల ప్రత్యేక పూజలు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 18: భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గాభవానీ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని నారింజ రంగు చీరతో, వివిధ రకాల పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గోకుల్‌ షెడ్‌లో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. భక్తుల సందడితో ఏడుపాయల క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Spread the love

Related News

Latest News