- రూ.11 కోట్ల నిధులు మంజూరు.. దసరా తర్వాత పనులు ప్రారంభం
- శాసనసభలో ఎమ్మెల్యే కవ్వంపల్లి గళం.. ఎట్టకేలకు కదలిక
ప్రతిపక్షం, మానకొండూర్, అక్టోబర్ 18: గన్నేరువరం మండల ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. దసరా తర్వాత పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ సుముఖత వ్యక్తం చేయడంతో ఈ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ఆందోళనలు.. నిరసనలతో కదలిక
గతంలో బిల్లులు పెండింగ్లో పడటంతో కాంట్రాక్టర్ రహదారి పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో గుండ్లపల్లి–పొత్తూరు మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిని పూర్తి చేయాలని వివిధ రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఉద్యమబాట పట్టారు. నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆందోళనల సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది.
శాసనసభలో సమస్యను లేవనెత్తిన ఎమ్మెల్యే
రహదారి సమస్యను తీవ్రంగా పరిగణించిన మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లి, పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.
రూ.11 కోట్లతో పనులకు మార్గం సుగమం
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సప్లిమెంటరీ నోట్ విడుదల చేయడంతో నిధుల మంజూరుకు మార్గం ఏర్పడింది. ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించడంతో రహదారి నిర్మాణ పనులను తిరిగి చేపట్టేందుకు అవకాశం కలిగింది. దసరా తర్వాత పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడంతో త్వరలోనే రహదారి నిర్మాణం పట్టాలెక్కనుంది.
తీరనున్న ప్రజల రవాణా కష్టాలు
డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే గుండ్లపల్లి–పొత్తూరు మార్గంలో ప్రయాణం సులభతరం కానుంది. వాహనదారుల ఇబ్బందులు తగ్గడంతో పాటు స్థానిక గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎన్నాళ్లుగానో పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కార దిశగా అడుగులు పడటంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభలో సమస్యను ప్రస్తావించి నిధుల మంజూరుకు కృషి చేయడం ఈ పరిణామానికి దోహదపడిందని స్థానికులు పేర్కొంటున్నారు.





























