పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్న హరీశ్ రావు
కార్మికులకు పండుగ కానుకల పంపిణీ
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట అక్టోబరు 19: అద్దంలా మెరిసే గ్రామాలు నగరాల వెనుక పారిశుధ్య కార్మికుల చెమట చుక్కలు దాగి ఉన్నాయి. ఎండనక, వాననక, చలినక రోడ్లను శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు వెలకట్ట లేనివి. వారి శ్రమకు తగిన గుర్తింపు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారితో కలిసి టిఫిన్ చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని తన సొంత ఖర్చులతో మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు ప్యాంట్లు, షర్టులను కానుకలుగా అందజేశారు.
కార్మికుల శ్రమతో జాతీయ గుర్తింపు
సిద్ధిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, జాతీయస్థాయి గుర్తింపు రావడం తన ఒక్కడి గొప్పతనం కాదని హరీశ్‌రావు అన్నారు. తెల్లవారుజామునp విధులకు హాజరై, రాత్రింబవళ్లు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల కష్టమే ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే కార్మికులను గౌరవించడం అందరి బాధ్యత అని చెప్పారు.
రూ.8,300 నుంచి రూ.16,600కు పెంచాం
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారిసాధ్య కార్మికులకు రూ.8,300 వేతనం మాత్రమే ఉండేదని హరీశ్ రావు పేర్కొన్నారు. జీతాలు నెలల తరబడి అందక కార్మికులు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో దశల వారీగా వేతనాలను పెంచి రూ.16,600కు చేర్చామని తెలిపారు.కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి, ఏడుగురు కార్మికులతో ఒక గ్రూపును ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేసే విధానాన్ని అమలు చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా కార్మికుల వేతనాలను పెంచలేదని విమర్శించారు. మరోవైపు నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, రవాణా ఛార్జీలు పెరిగాయని అన్నారు. పెరిగిన ధరలతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
శ్రమ తగ్గించేలా మౌలిక సదుపాయాలు
సిద్ధిపేటలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పారిశుధ్య కార్మికుల పని భారం గణనీయంగా తగ్గిందని హరీశ్ రావు తెలిపారు. గతంలో మురుగు కాలువల్లోకి దిగి చెత్తను తొలగించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. స్వీపింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చి ప్రధాన రహదారులను శుభ్రం చేసే ఏర్పాట్లు చేశామన్నారు. వీధుల్లో చెత్త కుండీలను తొలగించి, తడి చెత్త, పొడి చెత్త సేకరణకు ఇంటింటికీ ఆటోలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్లాస్టిక్ వంటి పునర్వినియోగ పదార్థాల సేకరణ ద్వారా కార్మికులకు అదనపు ఆదాయం పొందే అవకాశం కల్పించామని వివరించారు. పట్టణంలో పందుల సమస్యను పరిష్కరించడంతో పరిశుభ్రత మెరుగు పడిందని చెప్పారు. కార్మికుల శ్రమ కూడా తగ్గిందన్నారు.
నల్లా ఆపరేటర్లకూ ఊరట
గతంలో నీటి సరఫరా కోసం నల్లా ఆపరేటర్లు అర్ధరాత్రి, తెల్లవారుజామున సైతం విధులు నిర్వహించాల్సి వచ్చేదని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ద్వారా సిద్ధిపేటకు నీటిని అందించే వ్యవస్థతో వారి ఇబ్బందులు తగ్గాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్ణీత సమయాల్లో నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు నల్లా ఆపరేటర్లు, మొక్కల సంరక్షణ కార్మికులకు కూడా గ్రూపు విధానాన్ని వర్తింప జేసి నేరుగా వేతనాలు అందించాలని కోరుతున్నారని తెలిపారు.
అసెంబ్లీలో కార్మికుల తరఫున పోరాటం
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిల దీస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. మిగతా మున్సిపల్ విభాగాల కార్మికులకూ గ్రూపు విధానం అమలు చేసేలా పోరాడతానని హామీ ఇచ్చారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ, బ్యాంకు ఖాతాల సమస్యలను మున్సిపల్ అధికారులు, చైర్మన్ సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని సూచించారు. కరోనా సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించారని గుర్తుచేశారు. అలాంటి కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించవద్దన్నారు.
కార్మికుల కష్టమే అసలైన అలంకారం
గతంలో చిన్నచిన్న వీధులు, మురుగు కాలువలు, నీటి సమస్యలతో ఉన్న సిద్ధిపేట నేడు సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, అందమైన డివైడర్లు, చెట్లతో అభివృద్ధి చెందిందని హరీశ్ రావు అన్నారు. కోమటి చెరువు వంటి అభివృద్ధి కార్యక్రమాలు పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని పేర్కొన్నారు. ఈ మార్పుల వెనుక పారిశుధ్య కార్మికుల శ్రమ కూడా ఉందని చెప్పారు. పెరిగిన ధరల నేపథ్యంలో కార్మికుల వేతనాలను పెంచడం అత్యవసరమని, వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హరీశ్ రావు తెలిపారు. కార్మికుల కుటుంబాలు గౌరవంగా జీవించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

































