ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆశయాలు చిగురించాలి
జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దసరా శుభాకాంక్షలు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 19: చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, ఆశయాలు, విజయాలను తీసుకు రావాలని ఆకాంక్షించారు.తెలంగాణలో దసరా పండుగకు ప్రత్యేకమైన సాంస్కృతిక విశిష్టత ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. జమ్మి చెట్టును పూజించడం, జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు ఇచ్చి పుచ్చు కోవడం మన సంప్రదాయమన్నారు. పాలపిట్టను దర్శించడం తెలంగాణ సంస్కృతిలో విశిష్టమైన ఆచారమని తెలిపారు. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపు కోవాలని ఆకాంక్షించారు. జమ్మి ఆకుల మార్పిడితో పరస్పర ప్రేమాభిమానాలు మరింత పెరగాలని అన్నారు. ఈ విజయదశమి ప్రతి ఇంటా ఆనంద ఉత్సాహాలను నింపాలని హరీశ్ రావు కోరుకున్నారు. రైతన్నల పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పంటలతో పల్లెలు కళకళలాడాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.




























