ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 19: నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీ సప్తశతి చండీయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ది రాక్ స్టార్ యూత్ అసోసియేషన్, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ వేద పండితులు అజయ్ శర్మ, వారి శిష్య బృందం ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అజయ్ శర్మ మాట్లాడుతూ, చండీ యాగం నిర్వహించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. భక్తితో అమ్మవారిని పూజించడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని వివరించారు. యాగం అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. గ్రామ సర్పంచి చేర్యాల రాజు, రెడ్డి సంఘం సభ్యులు, ది రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.































