నలుగురు నిందితులు అరెస్ట్..
20 మేకలు, గొర్రెలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
సీసీటీవీ ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు
పోలీసులను అభినందించిన సీపీ రష్మీ పెరుమాళ్
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 19: సిద్ధిపేట పరిసర ప్రాంతాలలో పాటు రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మేకలు, గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను చిన్నకోడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి తొమ్మిది మేకలు, 11 గొర్రెలు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దొంగతనాలు
చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన వరకొట్టు లింగం తనకు చెందిన ఆరు గొర్రెలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నమ్మదగిన సమాచారం, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పగలు రెక్కీ.. రాత్రి వేళల్లో చోరీలు
పోలీసుల విచారణలో మహమ్మద్ అబ్దుల్ రహమాన్ అలియాస్ ఎంసారపు శేఖర్, గొల్లెన రాజు, బొంతల రాజు, గండికోట వెంకటేశ్ అనే నలుగురు కలిసి పశువుల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. గ్రామాల శివార్లలోని మేకలు, గొర్రెల షెడ్లను లక్ష్యంగా చేసుకొని, పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో జీవాలను దొంగిలించే వారని పోలీసులు తెలిపారు. చోరీ చేసిన పశువులను కేశవపట్నం గ్రామంలోని ఓ షెడ్లో దాచే వారని సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించారు.
నిందితుల రిమాండ్
నిందితుల నుంచి మొత్తం 20 జీవాలు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
పోలీసు బృందానికి సీపీ అభినందనలు
ఈ కేసును వేగంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్, చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్, పోలీసు సిబ్బంది తిరుపతి, పరశురాములు, సీసీఎస్ సిబ్బంది యాదగిరి, జగదీశ్ లను సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.





























