సిద్ధిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా చల్లారం మల్లారెడ్డి
కవిత నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా : చల్లారం మల్లారెడ్డి
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 21: సిద్ధిపేట జిలా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి లోని సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన చల్లారం మల్లారెడ్డికి రాజకీయంగా కీలక బాధ్యతలు దక్కాయి. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సిద్ధిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆయనను నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. తిమ్మాయిపల్లికి చెందిన చల్లారం మల్లారెడ్డి సామాన్య రైతు. తనకు ఉన్న వ్యవసాయ భూమిలో వివిధ పంటలతోపాటు కూరగాయలు సాగు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సామాన్య కుటుంబ నేపథ్యం, సామాజిక చైతన్యం కలిగిన మల్లారెడ్డి వ్యవసాయం చేసుకుంటూనే కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేసిన వెంటనే కవితను కలిసి ఆ పార్టీలో చేరారు. అప్పటినుంచి తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. మల్లారెడ్డి అంకిత భావాన్ని గుర్తించిన కవిత తెలంగాణ రక్షణ సేన సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. తనకు సముచిత ప్రాధాన్యత కల్పించి, కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తా..
తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు చల్లారం మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు..
పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని మల్లారెడ్డి తెలిపారు. ప్రజలకు చేరువగా ఉంటూ, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని వెల్లడించారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడికి నియోజకవర్గ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.





























