తెలంగాణ పాటకు గోల్డ్‌ కిరీటం!

సింగర్‌ వరంకు సినీ నటుడు గుండు రవితేజ ఘన సన్మానం

బతుకమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటిన గాత్రానికి ప్రశంసల జల్లు

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట అక్టోబరు 21: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిమళాన్ని తన గాత్రంతో ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రతిష్ఠాత్మక గోల్డ్‌ అవార్డును కైవసం చేసుకున్న సింగర్‌ వరం అభినందనలు అందుకున్నారు. బతుకమ్మ యువ చిత్రకారుల సవాలు 2026లో పాటల విభాగంలో ప్రథమ బహుమతిగా గోల్డ్‌ అవార్డు సాధించిన వరంను సినీ నటుడు గుండు రవితేజ ఘనంగా సన్మానించారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే గొల్లభామ చేనేత శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

తెలంగాణ సంస్కృతికి గాత్రాభిషేకం!

తెలంగాణ జీవనశైలి, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి పండుగ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలనే లక్ష్యంతో నిర్వహించిన పోటీలో సింగర్‌ వరం ప్రథమ స్థానాన్ని సాధించడం విశేషం. తన గాత్ర ప్రతిభతో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోవడం తెలంగాణ కళాకారులకు గర్వకారణమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

గొల్లభామ శాలువాతో ఘన సత్కారం

గోల్డ్‌ అవార్డు విజేత సింగర్‌ వరంను సినీ నటుడు గుండు రవితేజ గొల్లభామ శాలువాతో సత్కరించారు. సినీ నటుడు గుండు రవితేజ మాట్లాడుతూ, తెలంగాణ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను తన పాటల ద్వారా మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. బతుకమ్మ గొప్పదనాన్ని చాటిచెబుతూ అవార్డు సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ వరం మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.తెలంగాణ మట్టి పరిమళాన్ని, పండుగల వైభవాన్ని పాటల రూపంలో ప్రపంచానికి పరిచయం చేసే కళాకారులకు ప్రోత్సాహం అవసరమని ఈ సన్మానం చాటిచెప్పింది. సింగర్‌ వరం సాధించిన ఈ విజయం రాష్ట్ర కళా రంగానికి మరింత గుర్తింపు తీసుకురావాలని కళాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Spread the love

Related News

Latest News