బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు.. పోలీసుల తీరుపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం

బాధితులపైనే కేసులా? కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా?

రెండు రోజుల్లో న్యాయం జరగకుంటే డీజీపీకి ఫిర్యాదు.. ఆ తర్వాత కోర్టును ఆశ్రయిస్తాం

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 22: మెదక్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు కాంగ్రెస్‌ నాయకులకు, ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? అని ప్రశ్నించారు. మెదక్‌ పట్టణంలోని 15వ వార్డులో గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మహమ్మద్‌ హబీబ్‌కు చెందిన ఆటోను తగలబెట్టారని, తాజాగా దసరా రోజున బీఆర్‌ఎస్‌ తరఫున అందించిన ఆటోను కాంగ్రెస్‌కు చెందిన కొందరు వ్యక్తులు దహనం చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వారిపైనే కేసులు నమోదు చేయడం ఏమిటని నిలదీశారు.
హవేలీ ఘనపూర్‌ గ్రామంలోనూ బీఆర్‌ఎస్‌ నాయకులను దూషించి, వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టించారని ఆరోపించారు. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు పోస్టులు పెడుతున్నా ఇంతకాలం ఓపిక పట్టామని, ఇకపై ఇలాంటి వ్యవహారాలను సహించబోమని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

డీజీపీకి ఫిర్యాదు.. ఆ తర్వాత కోర్టుకు

తాము ప్రస్తావించిన నాలుగు ఘటనలపై రెండు రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చినట్లు పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. నిర్ణీత గడువులో న్యాయం జరగకుంటే రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని, అక్కడ కూడా న్యాయం లభించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అరేళ్ల మల్లికార్జున్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్‌, కౌన్సిలర్‌ మామిళ్ల ఆంజనేయులు, జుబెర్‌ అహ్మద్‌, దీపక్‌కుమార్‌, హవేలీ ఘనపూర్‌ సర్పంచ్‌ సాయిలు, పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News