*ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాభావ పరిస్థితులు .కేంద్రంపై ఒత్తిడికి అఖిలపక్షం పెట్టండి.
*వరి పంటలో గింజ లేదు.. పత్తిలో కాయ రాలుతోంది – రైతుల ఆవేదన.
*కేబినెట్లో చర్చిస్తే సరిపోదు.. మంత్రులు పొలాల్లోకి రండి .
*315 మండలాల్లో తీవ్ర వర్షాభావం – బీవీ రాఘవులు డిమాండ్
*రైతులకు తక్షణ సాయం ప్రకటించాలి – సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించాలి.
ప్రతి పక్షం నల్గొండ అక్టోబర్ 22: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ పట్టణంలోని 14వ డివిజన్ చర్లపల్లిలో ఎండిపోయిన వరి, పత్తి పంటలను సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నాయకులు, రైతు సంఘం నేతలతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి, రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
*వరి పరిస్థితి దయనీయం – గింజ లేని తాలు:
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. చర్లపల్లిలో వరి పంట పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. కొన్ని చోట్ల పంట పూర్తిగా ఎండిపోయిందని, కంకుల్లో తాలు తప్ప గింజ కనిపించని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
“మరో తడి నీరు అందితే పంట చేతికొచ్చేది. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతులకు చివరకు పైసా కూడా మిగలని దుస్థితి ఏర్పడింది. చిన్న, సన్నకారు రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే వారి కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారుతుంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పత్తి పంట పైకి పచ్చగా కనిపిస్తున్నా లోపల ఆకులు వాడిపోతున్నాయని, కాయలు ఎండిపోయి రాలిపోతున్నాయని తెలిపారు. మరో వారం రోజులు వర్షాలు కురవకపోతే పత్తి పంట కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
*కేబినెట్ చర్చలు సరిపోవు – పొలాల్లోకి రండి:
వర్షాభావ పరిస్థితులపై కేవలం కేబినెట్లో చర్చించడం సరిపోదని రాఘవులు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 315 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు.వాతావరణ శాఖ నివేదికలను చూసి ఏసీ గదుల్లో నిర్ణయాలు తీసుకోకుండా, ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ నేరుగా పొలాల్లోకి వెళ్లి పంట నష్టాలను కళ్లారా చూడాలని డిమాండ్ చేశారు. రైతుల వాస్తవ పరిస్థితులు తెలుసుకుని, తాగునీటి సమస్యతో పాటు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
*అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి:
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు నిధులు కోరినట్లు తెలుస్తోందని, అయితే ఆ నిధులు ఎంతవరకు సరిపోతాయో పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుంచి రైతులకు తక్షణ సహాయంగా ఎంత మొత్తం ఖర్చు చేయనుందో వెంటనే ప్రకటించాలని, రైతు సంఘాలతో చర్చించి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, వీరపల్లి వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, ఎండీ సలీం, దండంపెల్లి సత్తయ్య, కొండ అనురాధ, ఉట్కూరి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





























