చౌటుప్పల్‌లో దారుణం – భర్త, అత్తమామల దాడిలో వివాహిత మృతి

*దండు మల్కాపురంలో విషాదం.

*కుటుంబ కలహాలే కారణమా? కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న రాజస్థాన్ కుటుంబం.

*యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన 26 ఏళ్ల ప్రియాంక మాల్ .

*పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు – దర్యాప్తు చేస్తున్న చౌటుప్పల్ పోలీసులు.

ప్రతిపక్షం చౌటుప్పల్ అక్టోబర్ 22: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భర్త, అత్తమామల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

*అసలు ఏం జరిగింది?
చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం, బార్మేర్ జిల్లా, సోమేసరా నయా గ్రామానికి చెందిన ప్రియాంక మాల్ (26), తన భర్త పరాస్ మాల్ తో కలిసి జీవనోపాధి కోసం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి వలస వచ్చారు. అక్కడే ఒక కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
బుధవారం రాత్రి కుటుంబంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త పరాస్ మాల్, అత్తమామలు కలిసి ప్రియాంక మాల్ పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది.

*పోలీసుల దర్యాప్తు:
ఈ ఘటనపై దండు మల్కాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మథ కుమార్ కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త, అత్తమామలే దాడికి పాల్పడ్డారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాజస్థాన్ నుండి వలస వచ్చి బతుకుతెరువు కోసం పోరాడుతున్న ఒక చిన్న కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికులను కలచివేసింది.

Spread the love

Related News

Latest News