ధాన్యం ఆరబోసుకునేందుకు మార్కెట్‌ యార్డు గేట్లు తెరవాలి

రెండు రోజుల్లో తాళం తీయకపోతే మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పరకాల తిరుపతిరెడ్డి హెచ్చరిక

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 23: సిద్ధన్నపేటలోని నంగునూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు గేటుకు వేసిన తాళాన్ని వెంటనే తీసి రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పరకాల తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లోగా గేటు తాళం తీసి ధాన్యాన్ని ఆరబోసుకునే అవకాశం కల్పించకపోతే రైతులతో కలిసి మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
వానాకాలం వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబోసుకుని విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో సరైన కల్లాలు లేకపోవడంతో గత కొంతకాలంగా రైతులు సిద్ధన్నపేటలోని నంగునూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోసుకుంటున్నారు. యార్డులో స్థలం లభించని సందర్భాల్లో రహదారులపైనే ధాన్యాన్ని ఆరబోసుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈసారి ధాన్యాన్ని ముందుగా ఆరబోసుకుని, ఆ తర్వాతే మార్కెట్‌ యార్డుకు తీసుకురావాలని అధికారులు సూచిస్తూ యార్డు గేటుకు తాళం వేసి ఉంచడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందని తిరుపతిరెడ్డి అన్నారు. గ్రామాల్లో ధాన్యం ఆరబోసుకునేందుకు తగిన స్థలాలు లేకపోవడంతో రైతులు మార్కెట్‌ యార్డు పై ఆధార పడుతున్నారని తెలిపారు. యార్డులోకి అనుమతించక పోతే ధాన్యాన్ని ఎక్కడ ఆర బోసుకోవాలని ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ సీనియర్‌ నాయకుడు అన్న రాజయ్య, సిద్ధన్నపేట గ్రామ బూత్‌ కమిటీ అధ్యక్షుడు బొల్లు అజయ్‌తో కలిసి తిరుపతిరెడ్డి మార్కెట్‌ యార్డు వద్ద పరిస్థితిని పరిశీలించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ధాన్యం తడిసి పోకుండా, నాణ్యత దెబ్బతినకుండా ఆర బోసుకునే సౌకర్యం కల్పించడం మార్కెట్‌ కమిటీ బాధ్యత అని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునే సమయంలోనే వారికి సహకారం అందించాల్సిన అధికారులు, గేటుకు తాళం వేసి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్న రాజయ్య అన్నారు. యార్డులో అందుబాటులో ఉన్న స్థలాన్ని సక్రమంగా వినియోగించి రైతులకు ధాన్యం ఆర బోసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించక పోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బొల్లు అజయ్‌ హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News