ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు మెదక్ సిటిజన్స్ ఫోరం మద్దతు

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 23: నేషనల్ హెల్త్ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మెదక్ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట గత 11 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు మెదక్ సిటిజన్స్ ఫోరం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని మెదక్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు బి. కొండల్‌రెడ్డి, నాయకులు పీడీ ఆనందం, యాచం నాగభూషణం అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అమలు చేసిన విధంగా తెలంగాణలోనూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగులకు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కాకుండా స్టేట్ హెల్త్ సొసైటీ ద్వారానే ప్రతి నెల ఐదో తేదీలోపు వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 60, 1195లను అమలు చేయడంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం అత్యవసరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చి, సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News