రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి – దశాబ్దాల కల నెరవేరేదెన్నడు?

*దేశంలో 19 రాష్ట్రాల్లో ఎస్సీలు… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీ-ఏ లా? రజకులకు తీవ్ర అన్యాయం..!

*విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తీవ్ర వివక్ష – బీసీ-ఏ లోనే మగ్గుతున్న రజక జాతి.

*ఇక ఉద్యమమే మార్గం – రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు పోరాటం ఆపేది లేదని సంఘాల హెచ్చరిక.

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపాటు – రజకుల ఓట్లు కావాలి, హక్కులు వద్దా? అని ప్రశ్న.

ప్రతిపక్షం ప్రత్యేక కథనం

ప్రతిపక్షం, అక్టోబర్ 24, హైదరాబాద్: దేశంలో 19 రాష్ట్రాల్లో ఎస్సీలు… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీ-ఏ లా? రజకులకు తీవ్ర అన్యాయం.. దేశవ్యాప్తంగా రజకులకు సామాజిక న్యాయం జరుగుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రజకుల బతుకులు కలగానే మిగిలిపోతున్నాయి. అట్టడుగు వర్గంగా, అత్యంత కష్టతరమైన చాకలి వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న రజక జాతిని ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తున్నా, పాలకులు మాత్రం మొండిచేయి చూపుతున్నారు.

*19 రాష్ట్రాల్లో ఎస్సీ హోదా – ఇక్కడ మాత్రం ఎందుకు కాదు?

భారతదేశంలోని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ తదితర 19 రాష్ట్రాలలో రజకులను (ధోబీ) ఎస్సీ జాబితాలో చేర్చి గౌరవంగా చూస్తున్నారు. వారికి రాజ్యాంగబద్ధమైన విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.కానీ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మాత్రం రజకులను ఇంకా బీసీ-ఏ జాబితాలోనే ఉంచారు. దీనివల్ల లక్షలాది రజక కుటుంబాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతున్నాయి.

*అసలు రజకులు ఎందుకు ఎస్సీ కావాలి?

  1. సామాజికంగా వెనుకబాటు: నేటికీ గ్రామాల్లో రజకులను అంటరానివారిగా చూస్తున్నారు. చాకిరేవులో బట్టలు ఉతకడం వల్ల వారిని అపరిశుభ్రంగా భావించి వివక్ష చూపుతున్నారు.
  2. ఆర్థికంగా దీనస్థితి: కులవృత్తి తప్ప వేరే ఆదాయం లేదు. ఆధునిక లాండ్రీల పోటీతో ఉపాధి కోల్పోతున్నారు.
  3. విద్య, ఉద్యోగాల్లో వెనుకబాటు: బీసీ-ఏ లో ఉండటం వల్ల బీసీల్లోని బలమైన కులాలతో పోటీ పడలేక రజక విద్యార్థులు నష్టపోతున్నారు.

*ఎన్నికల హామీలు గాలికి..

ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు “రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తాం” అని హామీ ఇచ్చి, గెలిచాక మర్చిపోతున్నాయని రజక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజకుల ఓట్లు కావాలి కానీ, వారి హక్కులు ఇవ్వడానికి మాత్రం చేతులు రావడం లేదని విమర్శిస్తున్నారు.

*రజక సంఘాల అల్టిమేటం:

రజకులను వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో త్వరలోనే హైదరాబాద్‌లో లక్షలాది మంది రజకులతో “రజక గర్జన” బహిరంగ సభ నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి, 70 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రజక జాతికి సామాజిక న్యాయం చేయాలని రజక జేఏసీ నాయకులు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News