సాధించుకున్న జిల్లా కేంద్రం.. సాధించాల్సిన సమగ్ర అభివృద్ధి!
ప్రతిపక్షం, అక్టోబర్ 24, మెదక్: నిజాం పాలనలో పరిపాలనా కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మెదక్ ప్రాంతం.. కాలక్రమంలో జిల్లా కేంద్ర హోదాను కోల్పోయి, తిరిగి ఆ స్థానాన్ని సాధించుకునేందుకు దశాబ్దాల పాటు ఉద్యమించాల్సి వచ్చింది. మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఆకాంక్షతో స్థానిక మేధావులు, ప్రజాసంఘాలు, వివిధ ప్రాంతాల ప్రజలు సాగించిన ఉద్యమం ఈ ప్రాంత చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. సుమారు ఐదు, ఆరు దశాబ్దాలుగా సాగిన ఈ డిమాండ్ వెనుక పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ కావాలనే ఆకాంక్ష ప్రధానంగా ఉన్నాయి.
గతంలో మెదక్ జిల్లా కేంద్రాన్ని సంగారెడ్డికి తరలించడంతో మెదక్‌తో పాటు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక తదితర ప్రాంతాల ప్రజలు పరిపాలనా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. జిల్లా కేంద్రం మెదక్‌లోనే ఏర్పాటు చేయాలని స్థానిక మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేపట్టారు. గజ్వేల్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన రాందాస్ వంటి నాయకులు సైతం ఈ డిమాండ్‌కు మద్దతుగా నిలిచిన సందర్భాలున్నాయి. పూర్వ మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలకు సమానంగా పరిపాలనా సేవలు అందాలంటే మెదక్‌లోనే జిల్లా కేంద్రం ఉండాలనే వాదన బలంగా వినిపించింది.
తెలంగాణ ఉద్యమం.. జిల్లా పునర్వ్యవస్థీకరణ
తెలంగాణ వనరులు ప్రజలకే దక్కాలనే ఆకాంక్షతో దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమాలు జరిగాయి ఆ పోరాటాలలో ఎంతోమంది యువకులు అమరులయ్యారు. ప్రజా ఉద్యమాలను రాజకీయాల్లో వైపు మళ్ళించడం లో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రధాన పాత్ర వహించగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారు. సుదీర్ఘ ఉద్యమం అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో 2016లో మెదక్ జిల్లా ప్రత్యేక జిల్లాగా అవతరించింది. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఏర్పాటు కావడంతో మెదక్ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది.అయితే, జిల్లా ఏర్పాటుతోనే అభివృద్ధి సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని భావించలేం. జిల్లా పునర్వ్యవస్థీకరణలో మెదక్ పరిధి తగ్గి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు వేర్వేరుగా ఏర్పడటంతో ప్రాంతాల మధ్య పరిపాలనా, ఆర్థిక, పారిశ్రామిక అవకాశాల్లో తేడాలపై చర్చ కొనసాగుతోంది. పూర్వ మెదక్ జిల్లాలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలు కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లడం, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం స్థానిక ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి.
పరిశ్రమలు.. విద్యాసంస్థలే అభివృద్ధికి పునాది
మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికీ పారిశ్రామికంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంతానికి మంజూరైనట్లు చెబుతున్న కొన్ని పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయనే అభిప్రాయం ఉంది. పరిశ్రమల స్థాపనలో ప్రాంతీయ సమతుల్యత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదక్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతో కూడిన ఉద్యోగాలు కల్పించాలి.ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తివిద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు పెరిగితే విద్య కోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలు ఒకదానికొకటి అనుసంధానమైతేనే జిల్లా ఆర్థికంగా బలపడుతుంది. మెడికల్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల వంటి విద్యాసంస్థల ఏర్పాటు జిల్లా అభివృద్ధికి తోడ్పడే పరిణామాలు. వీటితో పాటు మరిన్ని ఉన్నత విద్యాసంస్థలను సాధించుకోవాల్సిన అవసరం ఉంది.
వ్యవసాయానికి నీరు.. పర్యాటకానికి ప్రోత్సాహం
మెదక్ ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. ఘనపూర్ ఆయకట్టు, చెరువుల పునరుద్ధరణ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా సాగునీటి వనరులను మెరుగుపరిచే ప్రయత్నాలు జరిగాయి. చెరువులు, కాలువల్లో పూడిక తొలగింపు వంటి పనులు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయి. అయితే, వాటి ఫలితాలను నిలబెట్టుకోవాలంటే నిరంతర నిర్వహణ, సాగునీటి పంపిణీలో సమర్థత, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ముఖ్యం.మెదక్ చారిత్రక చర్చి, ఏడుపాయల వనదుర్గామాత ఆలయం తదితర ప్రాంతాలకు పర్యాటక ప్రాధాన్యం ఉంది. తగిన రహదారులు, పారిశుధ్యం, వసతి, తాగునీరు, పర్యాటక సదుపాయాలు అభివృద్ధి చేస్తే స్థానిక వ్యాపారాలకు, ఉపాధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. పర్యాటక రంగాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం ద్వారా జిల్లా ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
కోట్లాది ప్రజాధనం.. నిరుపయోగంగా ఉండకూడదు
కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన క్రీడా మైదానం సరైన నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యువతకు క్రీడా అవకాశాలు కల్పించాల్సిన స్టేడియం నిరుపయోగంగా ఉంటే ప్రజాధనం వెచ్చించిన లక్ష్యం నెరవేరదు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి, స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. కోచ్‌ల నియామకం, క్రీడా సామగ్రి, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.
జిల్లా ఏర్పాటుతో సమీకృత కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల నిర్మాణం, కొత్త మండలాల ఏర్పాటు వంటి పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలో ఉపయోగపడాలి. భవనాల నిర్మాణంతో పాటు వాటిలో సమర్థవంతమైన సేవలు అందించడం కూడా అంతే ముఖ్యం.
మరో ఉద్యమం అవసరం.. కానీ అభివృద్ధి కోసం!
మెదక్ జిల్లా కేంద్రం కోసం సాగిన ఉద్యమం ఒక చారిత్రక ప్రజా ఆకాంక్షకు ప్రతిరూపం. ఆ ఉద్యమం సాధించిన ఫలితాన్ని ఇప్పుడు సమగ్ర అభివృద్ధిగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాసంఘాలు, మేధావులు, యువతపై ఉంది. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, మెరుగైన వైద్యసేవలు, రవాణా సదుపాయాలు, క్రీడా మౌలిక వసతులు, వ్యవసాయాభివృద్ధి వంటి అంశాలపై సమిష్టి కార్యాచరణ అవసరం.మెదక్‌కు గతంలో జరిగిన అన్యాయాలపై చర్చించడం మాత్రమే కాకుండా, ప్రస్తుతం జిల్లాకు ఏమి కావాలి, ఏ రంగానికి ఎన్ని నిధులు అవసరం, ఏ సంస్థలను సాధించుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలి. అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో మరో చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. అది ఏ రాజకీయ పార్టీకి పరిమితమైన ఉద్యమం కాకుండా, జిల్లా ప్రయోజనాలను కేంద్రంగా చేసుకున్న ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి.జిల్లా కేంద్రాన్ని సాధించుకున్న మెదక్.. ఇప్పుడు అభివృద్ధిలోనూ తనదైన స్థానం సంపాదించుకోవాలి. దశాబ్దాల ఉద్యమ స్ఫూర్తి పరిశ్రమల స్థాపనలో, విద్యావకాశాల విస్తరణలో, యువతకు ఉపాధి కల్పనలో, రైతుల సంక్షేమంలో ప్రతిఫలించినప్పుడే ఆ ఉద్యమానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.
రచన : మేడిశెట్టి శ్యాం రావు ( తెలంగాణ ఉద్యమ నేత .మాజీ టిఎన్జీవో జిల్లా నాయకులు)
9440036562
మెదక్
( మెదక్ జిల్లా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ జిల్లాపై ప్రత్యేక కథనం )




























