*సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం – ఏదుల నుంచి డిండికి 0.5 టీఎంసీకి గ్రీన్ సిగ్నల్.
*శ్రీశైలం నుంచి ఏదులకు 2 టీఎంసీలతో పాటు అదనంగా 0.6 టీఎంసీ – రెండు జిల్లాల నేతల సమ్మతి.
*డిండి ఎత్తిపోతలపై చిగురిస్తున్న ఆశలు – గతేడాది కేబినెట్ నిర్ణయానికే ప్రభుత్వ మొగ్గు.
*ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం – ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.
ప్రతిపక్షం మునుగోడు, అక్టోబర్ 24 : డిండి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇన్నాళ్లూ ఏదుల నుంచి డిండికి నీటిని ఇవ్వడంపై మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో డిండికి ఏదుల నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.శ్రీశైలం నుంచి ఏదుల రిజర్వాయర్ కు 2 టీఎంసీలతో పాటు అదనంగా మరో 0.6 టీఎంసీ నీటిని తీసుకునేలా నిర్ణయించారు. అలాగే ఏదుల నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి 0.5 టీఎంసీ నీటిని తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచే నీటిని తీసుకోవాలన్న నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల డిమాండ్ కు సానుకూలత లభించినట్లయింది.
*ఫ్లోరోసిస్ పీడకు విముక్తి – నల్లగొండకు వరం
నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీటితో పాటు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు ఏదుల నుంచి నీటిని తీసుకునే అంశంపై మహబూబ్ నగర్ జిల్లా నుంచి అభ్యంతరాలు రావడంతో కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే నేరుగా డిండికి నీటిని తరలించాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి రావడంతో వివాదం మరింత పెరిగింది. తాజా నిర్ణయంతో ఆ వివాదానికి తెరపడింది.
*2007లో ప్రాజెక్టుకు రూపకల్పన – 2015లో జీఓ
డిండి ఎత్తిపోతల పథకానికి 2007లో అప్పటి ప్రభుత్వం రూపకల్పన చేసింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ పథకాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 జూన్ 11న అప్పటి ప్రభుత్వం రూ.6,194 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి జీఓ నంబర్ 107 జారీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా ఐదు రిజర్వాయర్ల నిర్మాణ పనులకు అప్పటి సీఎం కేసీఆర్ అదే ఏడాది శివన్నగూడెం వద్ద శంకుస్థాపన చేశారు.
*2025 జనవరి 5న కేబినెట్ నిర్ణయం
2025 జనవరి 5న ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఏదుల నుంచి 21.575 కిలోమీటర్ల మేర కాలువలు, టన్నెల్ తదితర పనులకు రూ.1,800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచింది. ప్రస్తుతం డిండి, సింగరాజుపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం సహా పలు రిజర్వాయర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
*ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం స్వాగతం
డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచే నీటిని తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఈ నిర్ణయంతో నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే అవకాశం ఏర్పడిందన్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటితో పాటు సాగునీరు అందించడంలో డిండి ప్రాజెక్టు కీలకంగా మారనుందని, ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.




























