బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ బి. చంద్రశేఖర్.

*పదిలో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఢిల్లీ టూర్ – మంత్రి కోమటిరెడ్డి సొంత ఖర్చుతో విమాన ప్రయాణం!

*టాపర్స్ కు బంపర్ ఆఫర్ – విమాన ఖర్చులు, షాపింగ్ ఖర్చులన్నీ మంత్రి వెంకట్ రెడ్డే భరిస్తారన్న కలెక్టర్.

*7వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి – బోర్డుపై రిఫ్లెక్షన్ ప్రశ్నలకు విద్యార్థుల సమాధానాలు.

*నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించండి – ఎల్ నినో ప్రభావం, ప్రతి చుక్కను కాపాడాలని కలెక్టర్ ఆదేశం.

ప్రతిపక్షం నల్గొండ, అక్టోబర్ 24 : నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పండగ లాంటి వార్త చెప్పారు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. పదవ తరగతి పరీక్షలో ప్రథమ ర్యాంకులు సాధించే విద్యార్థులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చులతో ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లనున్నారని కలెక్టర్ ప్రకటించారు. విమాన ప్రయాణ ఖర్చులతో పాటు, ఇతర ఖర్చులు, షాపింగ్ ఖర్చులను కూడా మంత్రి భరిస్తారని, ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తారని చెప్పారు.

*కలెక్టర్ ఆకస్మిక తనిఖీ:
శనివారం జిల్లా కలెక్టర్ బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.7వ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, విద్య పురోగతి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారని, చదువులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు బాగా బోధిస్తున్నారని, తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని విద్యార్థులు కలెక్టర్ కు తెలిపారు.అనంతరం పదవ తరగతిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. రిఫ్లెక్షన్, నాన్ రిఫ్లెక్షన్ కు సంబంధించిన అంశాలపై ప్రశ్నించగా, విద్యార్థులు బోర్డుపై సమాధానాలను వివరించిన తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

*వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి:
8, 9, 10 తరగతుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్ ను ఆదేశించారు. తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రతి విద్యార్థికి నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించి మెరుగైన మార్కులు సాధించేలా బోధన అందించాలని చెప్పారు.

*నీటి సంరక్షణపై కలెక్టర్ పిలుపు:
మూత్రశాలలు పరిశీలించిన కలెక్టర్, నీటి కుళాయిల్లో లీకేజీలు లేకుండా చూడాలని, అవసరమైన చోట కొత్త కుళాయిలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి వృథాను అరికట్టేందుకు పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎల్ నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి వినియోగంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని చెప్పారు. పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ రామాచారి, ఎంఈఓ అరుంధతి, ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, సుధారాణి, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News