తక్కువ ఖర్చుతో ఇల్లు.. ప్లాస్టింగ్‌ అవసరం లేని నిర్మాణం!

ఇందిరమ్మ ఇళ్లకు ఇంటర్‌లాకింగ్‌ మట్టి ఇటుకల సాంకేతికత

-రవి, సహాయ ఇంజినీరు, గృహ నిర్మాణ శాఖ

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 24: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తక్కువ ఖర్చుతో, ప్లాస్టరింగ్ అవసరం లేకుండా ఇళ్లను నిర్మించుకునేందుకు నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామని నంగునూరు మండల గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజినీరు రవి తెలిపారు. ఇంటర్‌ లాకింగ్‌ మట్టి ఇటుకలతో ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చని ఆయన వివరించారు. మండలంలోని కొండంరాజు పల్లిలో ఈ నూతన సాంకేతికతతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని రవి పరిశీలించారు. ఇంటి నిర్మాణ తీరును పరిశీలించి, లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చిన లబ్ధిదారులను అభినందించారు.

సాధారణంగా ఇళ్ల నిర్మాణంలో గోడల నిర్మాణం అనంతరం ప్లాస్టరింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంటర్‌లాకింగ్‌ మట్టి ఇటుకల సాంకేతికతలో ప్రత్యేక ఆకృతితో తయారు చేసిన ఇటుకలను ఒకదానితో మరొకటి అమర్చుతూ గోడలను నిర్మించవచ్చు. దీనివల్ల నిర్మాణంలో కొన్ని అదనపు పనులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫలితంగా ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును నియంత్రించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే లబ్ధిదారులు అందుబాటులో ఉన్న నూతన నిర్మాణ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని రవి సూచించారు. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, నిర్మాణ నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ ఇంటర్‌లాకింగ్‌ మట్టి ఇటుకల పద్ధతిని పరిశీలించవచ్చని వివరించారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ వ్యయంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇటువంటి నూతన సాంకేతిక పద్ధతులు ఉపయోగ పడతాయని తెలిపారు. నిర్మాణానికి ముందు మట్టి ఇటుకల నాణ్యత, గోడల బలం, స్థానిక పరిస్థితులకు అనుకూలత వంటి అంశాలను పరిశీలించి, సంబంధిత ఇంజినీర్ల సలహాలతో పనులు చేపట్టాలని సూచించారు.

Spread the love

Related News

Latest News