కేసీఆర్ త్యాగం, పోరాట స్ఫూర్తి మరువలేనివి
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్‌దే అధికారం: కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 29 : తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ ఒక చారిత్రక ఘట్టమని బీఆర్‌ఎస్ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, చేసిన త్యాగాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు వద్ద దీక్షా దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఉద్యమ ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో చేపట్టిన 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందన్నారు.
నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని కొనియాడారు.కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందడుగు వేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





























