ప్రతిపక్షం, ప్రతినిధి ములుగు, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని.. ప్రతి పేదవారికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. గురువారం బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి 2024-25 విద్య సంవత్సరంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ఉచిత భోజనం, ప్రభుత్వ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు ఉచిత వసతి తో పాటు కాస్మెటిక్స్ ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
గ్రామాలలో ఉండే ప్రాథమిక పాఠశాలలలో అగన్వాడి కేంద్రలలోని చిన్నారులకు ఈ విద్య సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం నర్సరీ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలు నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్య ద్వారా వచ్చే విజ్ఞానాన్ని ఎవరు దోచుకోలేరని, విజ్ఞానం తరగని నిధి అని అన్నారు. జూన్ 6 నుండి 19 వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని ఆమె సూచించారు. ఈ విద్య సంవత్సరంలో 1,71,150 ఉచిత పాఠ్య పుస్తకాలకు గాను 1,42,510 పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, 95,913 ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కమీటీల ద్వారా మౌలిక వసతుల కల్పించడం కోసం జిల్లా లోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల, గురుకులలో 367 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ లను నూతనంగా నియమించి మౌలిక వసతుల కల్పన కొరకు సుమారు రూ. 6.91 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.
అదే విధంగా ఐటీడీఏ పరిధిలోని 99 ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలల్లో కూడా పనులను చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా నేటి వరకు 256 పాఠశాలల్లో ఎంపిక చేసిన అన్ని రకాల పనులు పూర్తి చేస్తున్నాం అని పాఠశాలలో 95% పనులు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విద్య సంవత్సరంలో పాఠశాలలకు 6268 డ్యుయల్ డెస్క్ లు, 449 గ్రీన్ చాక్ బోర్డు లు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్దులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని.. వాటి లక్ష్య సాధనకు కృషి చేసి, తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా విద్యను అభ్యసించాలని విద్యార్దులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి,డి ఈ ఓ పాణిని, డీఎస్పీ రవీందర్, మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, ఎం ఈ ఓ లు, విద్యార్థిన, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.